హైదరాబాదులోని నారయణగూడ ఫ్లై ఓవర్ వద్ద నిర్మాణంలోనున్న ఓ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 13మంది కార్మికులు మృతి చెందారు. పోలీసులు, 108 సిబ్బంది, స్థానిక ప్రజలు శిథిలాలను తొలగిస్తున్నారు.
కాగా ఈ ప్రమాదంలో సుమారు 20మంది కార్మికులు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే శిథిలాలు మొత్తం తొలగించిన తర్వాతే మృతులు సంఖ్యను చెప్పగలమని అధికారులు చెపుతున్నారు.
కూలిన భవనాన్ని ఆనుకుని బ్రిలియంట్ ప్రైవేటు పాఠశాల ఉంది. ప్రక్కనే భవనం కూలిపోవడంతో స్కూలు యాజమాన్యం ముందు జాగ్రత్త చర్యగా పిల్లలను పాఠశాల నుంచి బయటకు పంపివేసినట్లు తెలిపింది.
భవనం కూలిపోవడంపై ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఘటనా ప్రాంతాన్ని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించి సహాయక కార్యక్రమాలపై ఆరా తీశారు. ఇంకా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రమాధ స్థలాన్ని సందర్శించి భవనంలో చిక్కుకున్నవారిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. భవనం ఎందుకు కూలింది...? కారణాలేమిటన్న విషయాలపై తాను ప్రస్తుతం స్పందించననీ, ముందు శిథిలాల మధ్య చిక్కుకున్నవారిని కాపాడాలన్నారు.
|