రాష్ట్రంలో కొత్తగా రాజీవ్ గిరి బాలా ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ముఖ్యమంత్రి కె.రోశయ్య తన వార్షిక బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే, వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్రంలోని ఎయిడ్స్ రోగులకు కూడా నెలవారీ పింఛన్లు మంజూరు చేయనున్నట్టు ఆయన తెలిపారు.
శనివారం ప్రకటించిన తన వార్షిక బడ్జెట్ ప్రసంగంలో ఎప్పటిలా జలయజ్ఞానికే పెద్దపీట వేసిన రోశయ్య.. పలు కొత్త రకాల పథకాలను కూడా ప్రకటించారు. అలాగే, గత ఐదున్నర సంవత్సరాల కాలంలో ప్రభుత్వం సాధించిన వివిధ పథకాలను కూడా ఆయన వివరించారు.
రాష్ట్రంలో 103 ప్రత్యేక ఆర్థిక మండళ్ళకు కేంద్రం ఆమోదముద్ర వేసిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సర్కిళ్లు కాకుండా, కొత్తగా మరో ఏడు బీసీ స్టడీ సర్కిళ్ళను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
అలాగే, ఈ యేడాది నుంచి కొత్తగా రాజీవ్ గిరి బాల ఆరోగ్య బీమా పథకాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ పథకం ద్వారా కనిష్టంగా రూ.ఐదు గరిష్టంగా రూ.25 వేల వరకు వైద్యం చేయించుకోవచ్చని వివరించారు.
అలాగే, గడచిన ఐదేళ్ళలో రాష్ట్రంలో 18 విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామన్నారు. గత మూడేళ్ళలో 65 కొత్త డిగ్రీ కళాశాలలు, 49 పాలిటెక్నిక్ కళాశాలలు, 104 జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు.
నిజాంపట్నం ఓడరేవు అభివృద్ధి చేస్తామని, విశాఖ - కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్‌కు కేంద్రం అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. వచ్చే పదేళ్ళలో సంపూర్ణ అక్షరాస్యత సాధనకు అన్ని ప్రభుత్వ పాఠశాలలకూ కంప్యూటర్ల సరఫరా చేస్తామని తెలిపారు.
వైజాగ్, విజయవాడలలో బస్ ట్రాఫిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ను అమలు చేయనున్నట్టు తెలిపారు. దీనివల్ల భవిష్యత్‌లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామని రోశయ్య తెలిపారు. |