తెలంగాణాకోసం యువతీయువకులు, విద్యార్థులు ఆత్మ బలిదానం చేయడం పట్ల ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ... సమస్య చాలా సున్నితమైనది కనుక అందరూ సంయమనాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న ఏ ఉద్యమానికి ప్రాధాన్యత లేదని చెప్పననీ, అయితే సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని మనవి చేస్తున్నానన్నారు. యువతీయువకులకు ఎంతో భవిష్యత్తు ఉన్నదనీ, దయచేసి ఆత్మబలిదానాలకు పాల్పడవద్దని రోశయ్య విజ్ఞప్తి చేశారు.
ఆత్మహత్య చేసుకోవాలనే తలంపును వ్యక్తపరిచిన యువతీయువకుల భావాలను మళ్లించడానికి తోటివారు కృషి చేయాలనీ, ఇప్పటికే విద్యార్థులు చాలామంది ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునివ్వడం శుభపరిణామమని అన్నారు. అదేవిధంగా విద్యార్థులు కాస్త ఆవేశాలకు లోనై రాళ్లు వేసినప్పటికీ పోలీసులు సంయమనం పాటించాలని పదేపదే చెపుతున్నానన్నారు.
తాను ఒక ప్రాంతంలో పుట్టినప్పటికీ రాష్ట్రంలోని ప్రజలందరూ తనకు సమానమేననీ, తను పుట్టిన ప్రాంతానికి అనుకూలంగా, మరో ప్రాంతానికి వ్యతిరేకంగా ఉంటారన్న అపోహలు ఎవరూ పెట్టుకోవద్దని అన్నారు. సమస్యను పరిష్కరించే దిశగా కేంద్రప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందనీ, ఇందులో భాగంగా శ్రీకృష్ణ కమిటీని నియమించిందన్నారు. కమిటీకి అందరూ సహకరించి తమ తమ భావాలను వెల్లడించాలన్నారు.
నాయకులు కూడా విద్యార్థుల ఉద్రేకాలను మరింత ఉద్రేకపరిచేవిధమైన ప్రసంగాలు చేయవద్దని కోరుతున్నానన్నారు. ఇలా చేస్తే పరిస్థితి మరింత విషమించి సమస్య జఠిలమవుతుందన్నారు.
ఆ తర్వాత ప్రతిపక్షనేత చంద్రబాబు కూడా రోశయ్య సందేశాన్ని సమర్థిస్తూనే విద్యార్థులు ఆత్మబలిదానాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల పట్ల పోలీసులు సంయమనంతో వ్యవహరించాలన్నారు.
|