గత రెడు రోజులుగా అల్లర్లు చోటు చేసుకున్న పాతబస్తీలోని 25 పోలీసు స్టేషన్ల పరిధిలో పరిస్థితులు కుదుటపడుతున్నాయని రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి రోశయ్య బుధవారం ఉదయం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 25 పోలీసు స్టేషన్ల పరిధిలో పరిస్థితి ప్రశాంతంగా ఉందన్నారు.
అయితే, కర్ఫ్యూ ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నవీన్ మిట్టల్ నేతృత్వంలో అధికారుల బృందం పర్యటించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. ఇందులో కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, మెట్రో వాటర్ బోర్డు ఎండీ, రైతుబజార్ సీఈఓలు ఉన్నారన్నారు.
వీరంతా ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాకుండా, నీరు, పాలు, కూరగాయలు, రేషన్ సరుకులు సరఫరా చేసేందుకు వీలైన చర్యలు తీసుకుంటారన్నారు. ఇకపోతే బందోబస్తు చర్యల్లో 21 కంపెనీల బలగాలు నిమగ్నమైవున్నట్టు చెప్పారు. వీటితో పాటు.. ప్రశాంతంగా ఉన్న జిల్లా కేంద్రాల నుంచి కూడా బలగాలను తరలిస్తున్నట్టు తెలిపారు.
అల్లర్లు కొత్త ప్రాంతాలకు విస్తరించినా వాటిని అదుపు చేసేందుకు అవసరమైన బలగాలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 180 మందిని అరెస్టుచేశామన్నారు. మంగళవారం చోటు చేసుకున్న అల్లర్లకు బాధ్యులైన వారిలో కొంతమందిని గుర్తించామని, వీరిలో కొంతమందిని అరెస్టు చేశామని ఆమె వివరించారు. |