ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన ఐదో విడత ప్రజాపథం కార్యక్రమం విజయవంతంగా సాగుతున్నట్టు ముఖ్యమంత్రి కె.రోశయ్య తెలిపారు. తన సొంత జిల్లా ప్రకాశంలో ప్రజాపథం కార్యక్రమానికి సోమవారం ప్రారంభించిన ఆయన మంగళవారం సికింద్రాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజాపథంలో పలు చోట్ల అడ్డంకులు ఎదురైనప్పటికీ విజయవంతంగా సాగుతోందన్నారు.
ప్రజా సమస్యలను పరిష్కరించకుంటే నిరసన తెలుపడంలో ఎలాంటి తప్పులేదన్నారు. ప్రజలకు ఉన్న సమస్యలను తక్షణం పరిష్కరించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
అందువల్ల ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదిలావుండగా, ప్రజాపథం కార్యక్రమానికి వైఎస్సార్ పేరు పెట్టాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కోరారు. ఇదే అంశంపై ప్రభుత్వాన్ని కోరనున్నట్టు చెప్పారు.
|