తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ముఖ్యమంత్రి కె.రోశయ్య ఒక ఆఫర్ ఇచ్చారు. పనిలో పనిగా సవాల్ కూడా విసిరారు. సీఎం రోశయ్య తలచుకుంటే బాబ్లీ సమస్యను పది నిమిషాల్లో పరిష్కరిస్తారని కేంద్ర జలవనరుల మంత్రి పీకే.బన్సల్ చెప్పినట్టు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రోశయ్య ఘాటుగానే స్పందించారు.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా గురువారం సభలో బాబ్లీ, అల్మట్టి ప్రాజెక్టులపై వాడివేడిగా చర్చ సాగింది. తెదేపా సభ్యులు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దీనిపై సీఎం రోశయ్య ఘాటుగానే స్పందించారు.
ముఖ్యమంత్రి సీటులో చంద్రబాబును కూర్చోబెట్టేలా చేస్తాను అంతటితో ఆగకుండా అన్ని రకాలుగా సహకరిస్తాను. పది నిమిషాల్లో కాదు.. వారం రోజుల్లో సమస్యను పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. నోరు.. నాలుకు ఉందీ కదాని నోటికి ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదని ఆయన హితవు పలికారు.
ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ సభ్యుల సమక్షంలో కేంద్ర జలవనరుల శాఖామంత్రి పీకె.బన్సల్‌తో ముఖ్యమంత్రి రోశయ్య ఫోనులో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. దీంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వెంటనే తేదీని ఖరారు చేసి సమావేశం జరిగేలా చూడాలని రోశయ్య కోరారు. |