తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లను మహారాష్ట్ర సర్కారు ఆహ్వానించిందని ముఖ్యమంత్రి కె.రోశయ్య ఆరోపించారు. ఆరంభంలో కిమ్మనకుండా ఉండిన చంద్రబాబు.. ఇప్పుడు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. ప్రారంభంలోనే బాబ్లీ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుని ఉండివుంటే రాష్ట్రానికి ఇంత నష్టం జరిగి ఉండేది కాదన్నారు.
అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద తెదేపా జరిగిన మహా ధర్నాలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి రోశయ్య సర్కారుపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. దీనికి ప్రతిగా రోశయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబుపై ప్రతివిమర్శలు చేశారు.
బాబ్లీ ప్రాజెక్టు అంశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెదేపా చేస్తున్న ప్రయత్నాలను తాము అభినందిస్తున్నట్టు చెప్పారు. ఐతే... ఈ ప్రయత్నాలు ప్రాజెక్టు నిర్మాణానికి ముందే చేసి ఉంటే మరింత బాగుండేదన్నారు. ప్రజాప్రతినిధుల పట్ల మహారాష్ట్ర పోలీసులు నడుచుకున్న తీరును తాము అందరికంటే ముందే ఖండించామన్నారు.
బాబ్లీ ప్రాజెక్టుకు తెదేపా హయాంలోనే టెండర్లు పిలిచారని, ప్రాజెక్టు నిర్మాణాన్ని మొదలు పెట్టింది కూడా అప్పుడేనని రోశయ్య వివరించారు. తెలుగుదేశం పార్టీ ఈ అంశంపై అప్పుడెందుకు మాట్లాడలేదని సిఎం నిలదీశారు. అసలు తెలంగాణలో ఉప ఎన్నికలు లేకుంటే చంద్రబాబు ఈ యాత్ర చేపట్టేవారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తెలంగాణ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయాలని కొంతమంది నేతలు ఒత్తిడి చేయడంతో దాని నుంచి తప్పించుకునేందుకు బాబు ఈ ఎత్తుగడ వేశారని ఆయన ఆరోపించారు. |