ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య శుక్రవారం సాయంత్రం మరోమారు ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈనెల 24వ తేదీన అక్కడ జరిగే జాతీయ అభివృద్ధి సలహా మండలి సమావేశంలో ఆయన పాల్గొంటారు.
ఈ మండలి ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కొనసాగుతున్న విషయం తెల్సిందే. 25వ తేదీన మరోమారు పార్టీ అధినాయకత్వంతో చర్చలు జరుపుతారు. 26వ తేదీన ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగే బాబ్లీ ప్రాజెక్టు అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటారు.
ఇదిలావుండగా, ప్రధానితో జరిగే అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం అనుసరించాల్సిన, వినిపించాల్సిన అంశాలపై రాష్ట్ర రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు వీలుగా రాష్ట్ర రాజకీయ పార్టీలతో శుక్రవారం అఖిలపక్ష సమావేశాన్ని రోశయ్య ఏర్పాటు చేస్తున్నారు. |