మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఏర్పడిన నీటి సమస్య పరిష్కారాన్ని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి కె.రోశయ్య చెప్పారు. బాబ్లీతో పాటు.. మహారాష్ట్ర నిర్మిస్తున్న 13 ప్రాజెక్టుల అంశంలో రాష్ట్రానికి న్యాయం చేస్తారనే నమ్మకం తమకు కుదిరిందన్నారు.
సోమవారం సాయంత్రం రోశయ్య ఆధ్వర్యంలో అఖిలపక్షం నేతలు ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ 45 నిమిషాల పాటు సాగింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల వివరాలతో పాటు ప్రధాని తీసుకునే చర్యల గురించి రూపొందించిన 19 పేజీలతో కూడిన నివేదికను ప్రధానికి సమర్పించారు. ప్రధానితో భేటీ ముగిసిన అనంతరం సిఎం మీడియాతో మాట్లాడారు.
రెండు రాష్ట్రాల మధ్య నీటి సమస్య చాలా సున్నితమైనదని ప్రధాని పేర్కొన్నారన్నారు. అఖిలపక్షం చెప్పిన విషయాలను ప్రధాని సావధానంగా విన్నారన్నారు. ఈ సమస్యపై జలవివాదాలకు సంబంధించిన నిపుణులైన అధికారులతో సంప్రదించి తక్షణ చర్యలు తీసుకుంటానని ప్రధాని హామీ ఇచ్చారని రోశయ్య చెప్పారు. సమస్య పరిష్కారంపై సాధ్యమైనంత త్వరలో అధికారులతో మాట్లాడుతానని ప్రధాని చెప్పినట్లు రోశయ్య వెల్లడించారు.
ఆ తర్వాత అఖిలపక్షంలోని ఇతర పార్టీల నేతలు తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వీరంతా ప్రధాని హామీపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. సమస్యను రాజకీయంగా పరిష్కరించేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రధాని చెప్పారన్నారు. కేవలం బాబ్లీ మాత్రమే కాకుండా మహారాష్ట్ర నిర్మిస్తున్న మిగిలిన 13 ప్రాజెక్టుల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు చొరవ చూపుతామని హామీ ఇచ్చారని తెలిపారు.
అంతకుముందు ప్రధానమంత్రికి అఖిలపక్షం నేతలు సమర్పించిన నివేదికలో పేర్కొన్న ముఖ్యాంశాలు కింది విధంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ఆధారంగా ప్రధాని వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలి. ప్రధాని వ్యక్తిగతంగా చొరవ తీసుకుని బాబ్లీ గేట్లను తొలగించాలి. శ్రీరాంసాగర్‌లోకి చొచ్చుకుని వచ్చి నిర్మిస్తున్న బాబ్లీని నిలిపివేయాలి. బాబ్లీ సహా మహారాష్ట్ర నిర్మించిన 14 ప్రాజెక్టులను తక్షణం నిలుపుదల చేయించాలి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
కాగా, ప్రధానమంత్రిని కలిసిన వారిలో ముఖ్యమంత్రి రోశయ్యతో పాటు.. నరసారెడ్డి (కాంగ్రెస్), చంద్రబాబు (తెదేపా), చిరంజీవి (ప్రరాపా), జి.వినోద్ (తెరాస), కిషన్ రెడ్డి (భాజపా), నారాయణ (సీపీఐ), జూలకంటి శ్రీనివాసరెడ్డి (సీపీఎం), జయప్రకాష్ నారాయణ్ (లోక్‌సత్తా)తో పాటు.. మరికొన్ని చిన్నాచితక పార్టీలకు చెందిన నేతలు కూడా ఉన్నారు. |