ప్రస్తుతం వరద ఉద్ధృతి తీవ్రంగా ఉన్నా కర్నూలు జిల్లాలోనున్న శ్రీశైలం డ్యాంకు ఎలాంటి ప్రమాదం లేదని రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...వరద ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిపై ప్రతి అర్థగంటకు ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
వరద సహాయక చర్యలు చేపట్టేందుకుగాను తమ వద్ద నిధుల కొరత లేదని, ట్రెజరీ నుంచి నేరుగా డబ్బులు డ్రా చేసుకోవచ్చని ఆయన వివిధ జిల్లాల కలెక్టర్‌లకు సూచించారు. వరద సహాయక చర్యల కోసం ముంపు ప్రాంతాలకు వెళ్లిన నాలుగు హెలికాప్టర్లు అక్కడి వాతావరణం సరిగాలేక తిరిగొచ్చాయని ఆయన వివరించారు.
బెంగుళూరు నుంచి రెండు హెలికాప్టర్లను తెప్పించామని, కేంద్ర రక్షణశాఖ నుంచి కూడా ఎయిర్‌క్రాప్ట్‌ను తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. పునరావాస కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకుగాను రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి రఘువీరారెడ్డిని కర్నూలులో ఉండాలని ఆయన ఆదేశించారు.