రాష్ట్రంలో వరద ముంపు నుంచి బయటపడేందుకు అవసరమైన అన్ని రకాల సహాయక చర్యలను అందిస్తామని ప్రధాని భరోసా ఇచ్చారని ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో శుక్రవారం రాత్రి జరిపిన ఫోన్ సంభాషణల్లో హామీ ఇచ్చారని రోశయ్య తెలిపారు.
కేంద్రానికి సంబంధించి అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ స్థాయిలో వరద సంభవించడం ఇదే తొలిసారని ప్రధానికి వివరించినట్టు సీఎం చెప్పారు. శ్రీశైలం రిజర్వాయర్ ఎగువ ప్రాంతంలో నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్టు ఆయన వివరించారు.
అలాగే, కేంద్ర హోం మంత్రి చిదంబరం, రక్షణ శాఖ మంత్రి ఏకే.ఆంటోనీలతో కూడా ఫోన్‌లో మాట్లాడి వరద పరిస్థితిని వివరించినట్టు తెలిపారు. వీరుకూడా అన్ని రకాల సాయం అందించేందుకు ముందుకు వచ్చారని ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు. |