రాష్ట్రంలోని వరదలు ముంచెత్తిన కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు కర్ణాటకలోని వరద ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ శనివారం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరారు. ఆయనతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీలు ఉన్నారు.
జాతీయ విపత్తే.. తక్షణ సాయం వెయ్యి కోట్లు:
ఇదిలా ఉంటే.. శుక్రవారం వరద నష్టాలను పరిశీలించిన ప్రధాని మన్మోహన్ సింగ్ రూ. వెయ్యి కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించారు. శుక్రవారం ప్రధాని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద ముంపు ప్రాంతాలను ఆకాశ మార్గం ద్వారా పరిశీలించారు.
సాయంత్రం రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి రోశయ్య, ఇతర మంత్రివర్గ సహచరులు అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వరద బీభత్సం జాతీయ విపత్తేనని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. |