రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయం మరువలేనిదని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. రాష్ట్రంలో వచ్చిన వరద పరిస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని దేశ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కోరతానని సీఎం తెలిపారు. వరదల విషయంలో రాష్ట్రాన్ని కేంద్రం అన్నివిధాలా ఆదుకుందని ముఖ్యమంత్రి అన్నారు.
వరదనష్టాన్ని పూర్తిగా అంచనా వేయాల్సి ఉందని, సమగ్రమైన వివరాలు అందాక పరిహారంపై కేంద్రానికి నివేదిక పంపిస్తామని రోశయ్య వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. వరద ముంపుకు గురైన ప్రాంతాల విహంగ వీక్షణానికి ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం విజయవాడకు చేరుకున్నారు. మొత్తం నాలుగు హెలికాఫ్టర్లలో ప్రధానితో పాటు ముఖ్యమంత్రి రోశయ్య, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ, పనబాక లక్ష్మి, లగడపాటి ఈ ఏరియల్ సర్వేకి బయలుదేరారు.