తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కళ్యాణమస్తు కార్యక్రమంలో 7700 జంటలు ఒక్కటయ్యాయి. తితిదే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఐదో విడత కల్యాణమస్తు విజయవంతమైంది. గతంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నాలుగు విడతలుగా కల్యాణమస్తు నిర్వహించిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం కార్తీక శుద్ధ దశమి, ధనిష్టా నక్షత్రం, వృచ్చికా లగ్నంలో 9.20 నుంచి 9.32 గంటల మధ్య శుభముహూర్తంలో ఈ వివాహాలు జరిగాయి.
రాష్ట్ర రాజధానిలోని హైదరాబాద్‌లోని లలిత కళాతోరణంలో జరిగిన ఈ శుభకార్యానికి రాష్ట్ర గవర్నర్ ఎన్.డి.తివారీ, ముఖ్యమంత్రి కె.రోశయ్య, తితిదే ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు, రాష్ట్ర మంత్రులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కల్యాణమస్తు కార్యక్రమంలో ఒక్కటైన వధూవరులకు బంగారు తాళిబొట్టు, వెండి మట్టెలు, నూతన వస్త్రాలు, పెళ్ళి కంకణాలను తితిదే ఉచితంగా అందజేసింది. |