కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ శాసనసభాపక్ష నేతగా ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఏఐసీసీ పరిశీలుగా హాజరైన కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు. వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి సీఎల్పీ నేతగా రోశయ్య పేరును తొలుత ప్రతిపాదించగా, సమావేశానికి హాజరైన పార్టీ ఎమ్మెల్యేలు, విధాన సభ సభ్యులు, ఎంపీలందరూ ఏకగ్రీవంగా ఆమోదించారని ఆయన తెలిపారు.
అతకుముందు దివగంత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి దుర్మరణం పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి, సంతాపం తీర్మానం చేసినట్టు ఆయన తెలిపారు. వీటితో పాటు.. హెలికాఫ్టర్ ప్రమాదంలో మృత్యువాత పడిన సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, ప్రిన్సిపల్ కార్యదర్శి, పైలట్, కో-పైలట్ మృతి పట్ల, అలాగే, ఐదు జిల్లాల్లో సంభవించిన వరదల కారణంగా మరణించిన వారికి కూడా సంతాపం తెలుపుతూ తీర్మానాలు చేసినట్టు ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు.
అంతకుముందు.. అసెంబ్లీ పాత హాలులో కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం జరిగింది. ఇందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ సభ్యులు హాజరుకాగా, కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ, ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ చీఫ్ డీఎస్ తదితరులు హాజరయ్యారు. ఆ తర్వాత పలువురు నేతలు వైఎస్ చేసిన సేవలు, అభివృద్ధి పనులను ప్రస్తుతిస్తూ ప్రసంగించారు. |