కాంగ్రెస్ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకుని ఉన్న ఒక దళిత మహిళానేతకు అందలం ఎక్కించింది. రాష్ట్ర అసెంబ్లీలో పార్టీ ఫ్లోర్ లీడర్‌గా రాష్ట్ర సమాచార శాఖామంత్రి జె.గీతారెడ్డిని నియమించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రోశయ్య రాష్ట్ర గవర్నర్ తివారీకి ఆదివారం సాయంత్రం ఒక లేఖను అందచేశారు. సోమవారం ప్రారంభం అయ్యే అసెంబ్లీ శీతాకాల సమావేశంలో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు.
సాధారణంగా ముఖ్యమంత్రే సభా నాయకునిగా, అధికారపక్షం అధినేతగా శాసనసభలో వ్యవహరిస్తారు. కానీ రోశయ్య శాసన మండలి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కారణంగా శాసనసభకు నాయకత్వాన్ని ఎంపికచేసుకోవల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. శాసనసభలో ముఖ్యమంత్రి తరువాత ప్రాధాన్యత ఉన్నఈ పదవి కోసం పలువురు సీనియర్లు పోటీ పడ్డారు.
ముఖ్యంగా, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ ఢిల్లీ స్థాయిలోనే పైరవీలు సాగించారు. ఇటు పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ను అటు జగన్ వర్గాన్ని కూడా మంచి చేసుకోడానికి ప్రయత్నించారు. కానీ అన్ని రంగాల్లోనూ మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్న ఢిల్లీ అధిష్టానం గీతారెడ్డిని ఈ పదవికి ఎంపిక చేయడం గమనార్హం.
గీతా రెడ్డి గత 1980 సంవత్సరం నుంచి పలు మంత్రిపదవులను సమర్థవంతంగా నిర్వహించిన అనుభవం ఉంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అటు ముఖ్యమంత్రి, ఇటు మంత్రులకు సహకారం అందిస్తూ.. తన విధులను సమర్థతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
|